ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరదల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరపున మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గారు ఆర్థికసాయం అందించారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారితో పాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ కె. రాజేంద్రకుమార్ రిటైర్డ్ ఐపీఎస్ పాల్గొన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి వీరిరువురు పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వరదల కారణంగా అకాల మరణం పొందిన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత 48 మంది మృతుల కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష చొప్పున, చెక్కులను నారా భువనేశ్వరి గారు అందించారు
ఈ సందర్భంగా భువనేశ్వరి గారు మాట్లాడుతూ భావజాలాలు వేరైనా విపత్తుల సమయంలో అందరూ ఒక్కటిగా కలిసి వచ్చి బాధితులకు సాయం చేయాలన్నారు. నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయాన్ని ట్రస్ట్ ముందుకు తీసుకువెళ్తుందని ఆమె అన్నారు